గురుర్దేవో మహేశ్వరః

దీపపు కాంతిలో పటంలో ఉన్న దుర్గా మాత చూపు సజీవంగా కనిపిస్తోంది. 

ఆ నవ్వు జన్మ జన్మల దుఃఖాన్ని బాపేంత దివ్యంగా ఉంది. 

నా ఇల్లు, నా కుటుంబం, నా పూజ గది - ఇవేవీ నాకు కనిపించడం లేదు. మొగలి పరిమళపు అగరొత్తులు, దీపారాధన వెలుగులో బెజవాడ దుర్గమ్మ చిరునవ్వు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ చూపు నుంచి ఒక వెలుతురు తదేకంగా ప్రసరించి నా వైపు నెమ్మదిగా కదులుతూ వచ్చి నన్ను తాకింది, నా ఒళ్ళు జలదరించింది. 

"ఏవండీ, మధ్యాహ్నానికి కూరగాయలు తేవాలి" అని నా భార్య పిలుపు. ఈ లోకంలోకి వచ్చాను. 

"నేనెంత అదృష్ట వంతుడిని. అతి సామాన్య గృహస్థుని. ఒకానొక సమయంలో నా వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం అన్నీ భయంకరంగా ఉన్న సమయంలో - దేవుడిని ప్రార్థించడం, పూజలు చెయ్యడం అప్రయత్నంగా మొదలు పెట్టాను. చాగంటి కోటేశ్వర రావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి మహానుభావుల ప్రవచనాలు వింటూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాను. అప్పటి నుంచి నేను అదే పనిగా అమ్మవారిని, పరమ శివుడిని ఆరాధిస్తున్నాను. 

నాకిప్పుడు ముప్ఫయ్ ఎనిమిదేళ్లు. నా 28 వ ఏట నుంచి ఈ ఆరాధన కొనసాగుతూ ఉంది. ఎన్నో భగవంతుడి మహిమలను చవిచూశాను నేను, దేవుడి దయ వల్ల ఎన్నో కష్టాలు దాటాను. నాకు ఉద్యోగంలో రక రకాల చిక్కులు వచ్చినప్పుడు అనేక సార్లు, నా కూతురు పుట్టే సమయంలో నా భార్య ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు, నా రెండో సంతానం - చంటి గాడు ఏడాది వయసప్పుడు పెద్ద పేగు సమస్యతో నెల రోజులు హాస్పిటల్ లో ఉన్నప్పుడు, పోయిన ఏడాది హైదరాబాద్ లో వరదలు వచ్చి నేను ఆఫీస్ లో చిక్కుకు పోయినప్పుడు, నెల్లూరు లో మా నాన్నగారు హై బీపీతో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, మా అమ్మ కేదార్నాథ్ యాత్రలకు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకు పోయినప్పుడు - పదుల సంఖ్యలో ఇలాంటి అనేక సమస్యలప్పుడు - నేను అమ్మవారిని చేసిన ప్రార్థనలు ఫలించాయి. లెక్క లేనన్ని అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. అన్ని సమస్యల నుంచి దుష్ఫలితాలు లేకుండా బయట పడ్డాను. 

మరీ చిన్న వయసులో కాకపోయినా నాలో  అసలంటూ ఆధ్యాత్మిక పునాదులు వేసినందుకు నేను అమ్మవారికి ప్రతిరోజూ కృతజ్ఞతలు చెప్తూ ఉంటాను. ఎందరో యోగులు, సిద్ధులు, గురువుల పుస్తకాలు చదువుతూ ఆనందిస్తాను. నాకు తెలిసిన విషయాలు పది మందికీ చెప్తూ ఉంటాను. నా అనుభవాలు ఎదుటివారికి ఏమన్నా ఉపయోగ పడచ్చు అని నా జీవితంలో జరిగిన  అద్భుతాలను అందరికీ చెప్తూ ఉంటాను. కొంత మంది కళ్ళు విప్పార్చి వింటారు. కొంతమంది పెద్దగా పట్టించుకోరు.ఎవరి అర్హతని బట్టి వాళ్ళకి దేవుడు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తాడులే అని నేను నా మాటలని లక్ష్య పెట్టని వారిని వదిలేస్తాను. 

మరీ ముఖ్యంగా 'సద్గురు చిన్మయానంద మూర్తి' గారి ధార్మిక ఉపన్యాసాలు ఒక వాట్సాప్ గ్రూప్ లో ప్రతిరోజూ ఫాలో అవుతాను. నేను ఆయన ఏకలవ్య శిష్యుడిని. ఆధునిక జీవితానికి, సనాతన ధర్మానికి, సాంప్రదాయ జీవన విధానానికి మధ్య వారధిని నిర్మించిన అత్యంత అరుదైన మహానుభావులు ఆయన. సరస్వతీ నది లా బయటకు రాకుండా అంతర్వాహిని లాగా జ్ఞాన ప్రసారం చేస్తూన్న ఆధ్యాత్మిక వేత్త. ముఖతః ఆయనను ఎప్పుడూ చూడకపోయినా ఆయన తాత్విక చింతనకి, ఉపన్యాసాలకు నేను ముగ్ధుడిని అయ్యాను. గత రెండేళ్లుగా నాకు ఆయన దైవంతో సమానం. ఆయన దగ్గర సమస్యలు చెప్పుకున్న ఎంతో మంది కష్టాన్ని ఆయన కేవలం చిన్న చిన్న పూజల ద్వారా తొలగించారు అని విన్నాను. నేను ఎవరికి ఏ మంచి విషయం చెప్పినా చిన్మయానంద మూర్తి గారి మాటలను ఉటంకించడం నాకు సాధారణం అయ్యింది."

మా కాలనీ మార్కెట్ లో కూరగాయలు కొని బండి స్టార్ట్ చేస్తుంటే మా పక్కన అపార్ట్మెంట్ లో ఉండే సురేష్ కనిపించాడు. అతను సంతానం లేక బాధ పడుతున్నాడు, మెడికల్ గా చెయ్యవలసిన అన్ని ప్రయత్నాలు చేశారు.

"నెల్లూరు దగ్గర జన్నవాడ అనే క్షేత్రంలో 11 రోజులు దీక్షగా నిద్ర చేస్తే ఎలాంటి రోగం అయినా పోతుందని, పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని విన్నాను. ఒక సారి ప్రయత్నం చెయ్యండి. మా బావమరిది వాళ్ళు ఒక మూడు రోజులు అక్కడ నిద్ర చేసి వచ్చారు, నిరుడు వాళ్ళకి పాప పుట్టింది" అని చెప్పాను. 

"11 రోజులు అంటే సెలవు దొరకదు సార్. ట్రీట్మెంట్ కోసం గడిచిన ఆరు నెలలు ఫుల్ గా లీవ్స్ తీసుకున్నా" అన్నాడు. 

"మీకు ఎన్ని రోజులు వీలయితే అన్ని రోజులు వెళ్లి రండి. మా బావమరిది వాళ్ళు 3 రోజులు మాత్రమే ఉన్నారు, అయినా ఫలించింది. అనుభవంతోనే చెప్తున్నాను కదా, కనీసం 3 రోజులు అయినా వెళ్లి రండి"అని చెప్పాను. 

"మీరు చెప్తే కొంచెం హోప్ వచ్చింది, తప్పకుండా వెళ్తాను సార్ " అని నమస్కారం పెట్టి వెళ్ళాడు అతను. 

"నేను అతనికి సరిగ్గానే చెప్పానా ? 3 రోజులు మాత్రం దీక్ష చెయ్యండి అని చెప్పటానికి నా దగ్గర ఉన్న  శాస్త్రీయత ఏమిటి ? నా భక్తిని, నాకు తెలిసిన వాళ్ళ అనుభవాన్ని, నాకున్న పరిజ్ఞానాన్ని కలిపి నేను సలహా ఇచ్చాను." - అని ఒక క్షణం ఆలోచించాను. 

"ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు మాత్రం సశాస్త్రీయంగా దీక్షలు చెయ్యగలరు ? భగవంతుడికి అన్నీ తెలుసు. ఎవరి వీలుని బట్టి వారు చేస్తారు. దేవుడు అందుకే ఈ సలహాని అతని కోసం నా ద్వారా పలికించాడు"- అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. 

అలా బండి స్టార్ట్ చేశానో లేదో, 'అతను ' కనిపించాడు. మా కింద ఫ్లాట్ ని సెకండ్ హ్యాండ్ లో కొనుక్కుని నెల క్రితమే వచ్చారు అని విన్నాను. నెమ్మదస్తుడు అన్నారు కానీ చాలా డల్ గా కనిపిస్తాడు. బహుశా ఒక 40 ఏళ్ళ వయసు ఉంటుందేమో ! నేను మా ఫ్లాట్స్ కింద ఉదయం అందరితో మాట్లాడుతాను, సాయంకాలం వాక్ చేస్తూ అందరికీ ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ ఉంటాను. 'అతను' నాతో ఎప్పుడూ కలవలేదు. ఆధ్యాత్మికమైన సంభాషణని మాత్రమే కాదు, మాములు సంభాషణను కూడా నా దగ్గర ఎత్తలేదు. నా మెడలో రుద్రాక్ష మాల, నా నుదుటున పెద్ద బొట్టు గంధం, ప్రత్యేక సందర్భాల్లో నేను కట్టుకునే పట్టు పంచె -  ఇవేవీ అతన్ని నా వైపు తీసుకురాలేదు. బహుశా నాస్తికుడు అయి ఉంటాడు. 

ఒకటి రెండు సార్లు మాబాల్కనీ లో కూర్చుని రుద్రం పారాయణ చేశాను కొంచెం గట్టిగానే. కింద బాల్కనీ లో ఎవరో మనుషుల అలికిడి వినపడుతూనే ఉంది. కానీ అతను నా పారాయణని వింటున్నట్టు నాకు అనిపించలేదు. ఎప్పుడూ నా దగ్గరికి వచ్చి నన్ను ఎలాంటి ఆధ్యాత్మిక సలహాను అడగలేదు. 

"ఏ జీవుడికి ఎప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలో దేవుడికి తెలుసు. అతను ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తాడులే" అనుకున్నాను. 

ఇంటికి రాగానే మా కాలనీ ప్రెసిడెంట్ భార్య వాళ్ళ బంధువుల కుర్రాడిని, అతని భార్యని మా ఇంటికి తీసుకుని వచ్చారు. మా కాలనీ లో ఉన్న గుడిలో నేను తరచుగా రుద్రం, సహస్ర నామాలు, ఇతర శ్లోకాలు పారాయణ చేస్తుంటాను. మా ప్రెసిడెంట్ గారి భార్య శ్రద్ధగా వింటూ ఉంటారు. 

"మా చెల్లెలి కొడుకు,కోడలు వీళ్ళు. మా మరిది పోయాక ఎంతో కష్టపడి చెల్లెలు వీడిని పెంచింది. వాళ్ళ ఊళ్ళో హోటల్ వ్యాపారం ఉంది. కొత్తగా పెళ్లయింది. మాఇంటికి వచ్చారు. మిమ్మల్ని కలిసి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చారు" అన్నది ఆవిడ. 

నేను రోజు కుంకుమార్చన చేసే కుంకాన్ని కొంచెం పొట్లం కట్టి వారికి ఇచ్చి, ఆ రోజు నైవేద్యం పెట్టిన పండ్లు ఇచ్చి - నేను నా భార్య ఆ జంటని ఆశీర్వదించాము. 

"సద్గురు చిన్మయానంద మూర్తి గారు చెప్తారు - ఒక సారి పెళ్లి అంటూ జరిగాక - అక్కడ భార్య భర్త అని ఇద్దరు లేరు, ఒకరే ఉన్నారు అని. ఎలాంటి పరిస్థితిలో అయినా దీన్ని దృష్టిలో పెట్టుకోండి" అని చెప్పాను ఆ జంట కి.

"పుణ్య దంపతులు వీళ్ళు, చిన్న వయసులోనే ఎంతో దైవ భక్తి ... మాకాలనీ లో చాలా మందికి గురువు లాంటి వారు ఆయన" అని ఆవిడ నా గురించి ఆ కొత్త జంటకి చెప్పి సంతోషించింది. 

మొదట్లో నాకు ఇలాకాళ్ళకి దణ్ణం పెట్టించుకోవాలంటే చాలాఇబ్బందిగా ఉండేది. కానీ తర్వాత ఆలోచించాను - "నేను రోజూ అమ్మవారికి, స్వామివారికి పూజ చేస్తాను. నా పుణ్యాన్ని ఇలా కొంత మందికి ఇవ్వడం ద్వారా వారికీ నేను సహాయ పడితే మంచిదే కదా" అని ఈ నమస్కారాలు చేయించుకోవడానికి అలవాటు పడ్డాను. 

ఇంత మంది చేత ఆధ్యాత్మిక వ్యక్తిగా గౌరవింప బడుతున్న నేను 'అతడి' దృష్టికి అందక పోవడమే ఆశ్చర్యంగా ఉంది. 


 

ఆధ్యాత్మిక వ్యాప్తి పట్ల నాకు ఉన్న మక్కువని, 'అతడిని' ఆస్తికుడిగా చెయ్యాలన్న నా భావాలను అమ్మవారు గమనించినట్టు ఉన్నారు - ఒక రోజు నాకు తెలిసింది 'అతడి' భార్య జబ్బు చేసి హాస్పిటల్ లో ఉండి వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యిందని. ఇదే సమయం అని నేను తీరుగా దిద్దిన విభూతి కుంకుమతో చేతిలో ప్రసాదం పొట్లం తీసుకుని వాళ్ళ తలుపు తట్టాను. 

'అతడు' తలుపు తెరిచాడు. 

"మీ పై  ఇంట్లో ఉంటాను. నాపేరు లంకా అరుణ్ కుమార్" అని చెప్పాను. 

నమస్కారం చేసి లోపలికి రమ్మన్నాడు. ఇల్లు, ఇంట్లో వస్తువులు సింపుల్ గా ఉన్నాయి. ఏమిటో ఇతనిలాగే ఇల్లు కూడా డల్ గా ఉంది. సాదా షర్ట్, గళ్ళ లుంగీ కట్టుకుని ఉన్నాడు. అతి సామాన్య గృహస్థు లాగా ఉన్నాడు - వేషం, వాలకం కూడా. 

"మీ వైఫ్ కి అనారోగ్యంగా ఉంది, వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారని విన్నాను. ఏమన్నా అవసరమైతే అడగాల్సింది" అన్నాను. 

"భగవంతుడి దయ వల్ల తేలికగానే బయట పడ్డాం అండీ ... థాంక్యూ " అన్నాడు. 

"అయితే నాస్తికుడు కాదన్నమాట" అనుకున్నాను లోలోపల. 

"మేము ఈ కాలనీ లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. నాకు తెలిసినంతలో కొన్ని మంచి విషయాలను అందరికీ చెప్తూ ఉంటాను, గుడిలో ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటాను" అన్నాను. 

"చాలా సంతోషం అండీ ... మీ వంటి సత్సంగం దొరికినందుకు నేను ఆనందిస్తున్నాను" అన్నాడు అతను. 

ఈ మాట వల్ల ఇతను మంచి  ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది - అని సంతోషించాను. 

సద్గురు చిన్మయానంద మూర్తి గారి మాటను ఆయనకు ఉటంకించాను "గురువు తనంతట తాను  శిష్యులను వెతుక్కుని వచ్చి మరీ ఉద్ధరిస్తాడు అని మా గురువులు చెప్తుంటారు" అన్నాను నేను. 

"అవును అండీ ... గురువు ప్రేమ వెయ్యి మంది తల్లుల ప్రేమతో సమానం... గురువు కృపలేనిది మనం ఏమీ లేము అండీ" అంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకుని నమస్కరించాడు. 

"బహుశా ఇతనికి ఆల్రెడీ గురువులు ఉన్నారేమో ! కానీ గురువు దయని పొందిన శిష్యుడి వాలకం ఏ కోశానా ఇతనిలో లేదే" అని నా భృకుటి ముడి పడింది. ఇప్పుడు గమనించాను, అతని నుదురు మీద చిన్న కుంకుమ బొట్టు ఉంది. 

"సారీ అండీ ... మీ పేరు ఏమిటో అడగనే లేదు" అన్నాను. 

"సారీ అండీ ... నేను చెప్పలేదు. నా పేరు మూర్తి .. చిన్మయానంద మూర్తి" అన్నాడు. 

నా మెదడులో ఒక్కసారి ఒకపెద్ద పేలుడు జరిగింది, బుర్ర బ్లాంక్ అయ్యింది.

"సద్గురు చిన్మయానంద మూర్తి గారు మీరేనా ?" అని అడిగాను. 

"సద్గురు అనేది నా శ్రేయోభిలాషులు నాకు గౌరవంగా పెట్టుకున్న మాట అండీ ... కానీ మా గురువులను సద్గురువు అని అనడం సముచితం" అన్నారు ఆయన. 

"ఆ మహానుభావుడు మీరే అని అనుకోలేదు అండీ" అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాను. ఆయన ఇబ్బందిగా లేపి నన్ను కూర్చోబెట్టారు. 

"మహానుభావుడు అనేది పెద్ద మాట అండీ - మా గురువులు శ్రీ శ్రీ శ్రీ యోగి మహారాజ్ అవధూత గారు మహానుభావులు. నా మీద గొప్పప్రేమతో నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు" అన్నారు. 

"అలా అనకండి స్వామీ ! మీరు అజ్ఞాతంగా ఉన్నా సరే - సమస్యలని తెలుపుకున్న ఎందరికో మీ ఆధ్యాత్మిక శక్తితో మేలు కలిగించారు" అన్నాను. 

"నేను కేవలం మా గురువుల సంకల్పానికి పనిముట్టుని అండీ ... నాకెలాంటి శక్తీ లేదు. భగవంతుడి అనుగ్రహం, మా గురువుల దయ - జనాల అసలు సమస్యలని తీర్చాయి" అన్నారు ఆయన. 

ఇంతటి వినయశీలి, పుణ్యమూర్తి ఉన్న ఇల్లు ఇది - అని చుట్టూ చూశాను. డల్ గా లేదు, ప్రశాంతంగా - పరమ ప్రశాంతంగా ఉంది. ఆయన భార్య వచ్చి కాఫీ ఇచ్చారు. ఇద్దరి కళ్లలో తేజస్సు, కారుణ్యం తాండవిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న మొక్కలు కుండీల్లోఉన్నాయి. ఇలాంటి సౌజన్య మూర్తుల చేత పోషించబడుతూ నిరంతర ఆనందంలో సమాధి స్థితిలో ఉన్న యోగుల్లా ఉన్నాయి అవి. లేత గాలికి అప్పుడప్పుడూ తలాడిస్తున్న పసిపిల్లల్లా ఉన్నాయి ఒక్కోసారి. ఇంట్లో ఆణువణువూ పరమ శాంతి తాండవిస్తోంది. 

"విశ్రాంతి తీసుకోండి... మళ్ళీ కలుస్తాను" అని వాళ్ళ ఇద్దరికీ నమస్కారం చెయ్యబోయాను. 

"అయ్యో వద్దండీ .. మా గురువు గారికి నమస్కరించండి ... ఆయన దయ మన అందరి మీదా ఎల్లప్పుడూ ఉంటుంది. మనం అందరం ఆయన రక్షణలో ఉన్నాము" అని ఆయన గురువుల పటం చూపించారు. ఈ ఇంటికి, ఈ దంపతులకి ఇంత శాంతిని ఎవరిచ్చారో నాకు అర్థం అయ్యింది. 

బయటకు వచ్చి మ్రాన్పడిపోయి సిగ్గుతో వణికిపోతున్నాను. కొద్ది సేపు పైకెళ్లే మెట్ల మీద అలాగే నిలబడిపోయాను.  లోపల చిన్మయానంద మూర్తి గారి ఇంట్లో ఎవరిదో పీఠాధిపతుల అనుగ్రహ భాషణం అనుకుంటాను,  వినిపిస్తోంది. 

"నాకు అందరూ నమస్కరించి వారి వారి సమస్యలు నా దర్శనం వలన తీరాయి అంటూ చెప్తారు. పరమ ధార్మిక మూర్తి, సత్య నిష్టులు అయిన మాగురువుల దయ వల్ల మాత్రమే వారి వారి సమస్యలు తీరాయి. ఈ మహత్తు మా గురువులది, వారు నిత్యం ఆరాధించిన పరమేశ్వరిది .. మా గురువుల సంకల్పమే మాద్వారా మీకు అందినది" - అంటూ అనుగ్రహ భాషణం వస్తోంది.

నిస్సందేహంగానే ఈశ్వరుడు నన్ను కరుణించాడు. తనని అర్చించి తరించడానికి కావాల్సిన భక్తిని ఇసుమంత నాకు ఇచ్చాడు. నేను నా శక్తి కొద్దీ అర్చించాను, ఈశ్వర కృపని అనుభవించాను. కానీ నా సాధనతో పాటు పెరుగుతున్న అహంకారాన్ని, అజ్ఞానాన్ని నేనే పోషించాను. నాకు నేనే గురుత్వాన్ని ఆపాదించుకున్నాను. ఒక శిష్యుడికి ఉండాల్సిన వినయాన్ని వదిలిపెట్టాను. 

నా అహంకారం తొలిగాక కానీ నా కళ్ళకి 'అతడి' (నేను అమ్మవారిచే క్షమించబడెదను గాక ! ) ... ఆయన నిజ స్వరూపం గ్రహించే అవకాశంకలగలేదు. 


గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః !

గురుస్సాక్షాత్ పరంబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః !!


      

Comments

Popular posts from this blog

ప్రతి జీవుడు యశోదయే

దయా సముద్ర తరంగాలు