ప్రతి జీవుడు యశోదయే

 
 
 
 రేపల్లెలో యశోదమ్మ చిన్ని కృష్ణుడిని బయటకు వెళ్ళద్దు ఇంట్లోనే ఉండమని బుజ్జగిస్తుంటే - అల్లరి వాడైన కృష్ణయ్య తన మాటలతో యశోదమ్మని మాయ చేసిన ఒక చిలిపి తమిళ గీతం ఇది. ఈ గీతం బయటకు మాత్రం అల్లరి కృష్ణయ్య గడుసుతనాన్ని చూపిస్తోంది కానీ, లోపల ఏదో తత్త్వం ఉందని నాకు అనిపించి నేను రాసుకున్న అర్థం ఇది. 
 
నా గురువుల విషయంలో నాకున్న అనుభూతులు, అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలు - చాగంటి వారు, సామవేదం వారు లాంటి ఎందరో మహానుభావులు ఇచ్చిన భక్తి-ప్రేమల మేళవింపు నేను రాసుకున్న ఈ తత్వానికి ఆధారం. 
 
ఈ మొత్తం భావాలలో ఎక్కడన్నా నా అహంకారం తొంగిచూస్తూ ఉంటే - జగన్మాత నాకు తగిన బుద్ధిని ఇచ్చి నన్ను సన్మార్గంలోకి మళ్ళించుగాక. 
 
ఈ క్రింద వీడియో యొక్క అన్ని హక్కులు గౌరవనీయులైన కులదీప్ పాయ్ గారివి. నేను ఆయన వీడియో చూసి మైమరచి స్ఫూర్తి ని పొందాను కాబట్టి - నా రాతకి మరింత అర్థాన్ని ఇవ్వడం కోసం ఆయన వీడియో ని లింక్ చేశాను. 
 

 
 
పల్లవి:
యశోదమ్మ : బుజ్జి గోపాలుడా ! బయటకు వెళ్ళద్దు నాయనా ! నా మాట విను. 
కృష్ణుడు : అలా అనవద్దు అమ్మా ! నేను బయటకు వెళ్తాను. 
 
(యశోదమ్మ జీవుడు. భగవద్భక్తి / గురువు కరుణను రుచి చూసిన ఒక జీవుడు. చిన్ని కృష్ణుడు లీలా రూపుడైన పరమాత్మ / జగద్గురువు. నువ్వెప్పుడూ నాతోనే ఉండవయ్యా అని జీవుడు బ్రతిమాలుతుంటే, ఈ అనంత విశ్వంలో నా లీలలను నన్ను చెయ్యనివ్వు అని పరమాత్మ చెప్తున్నారు)
 
 
చరణం  1:
యశోదమ్మ : కాచిన చిక్కటి పాలు ఇస్తాను. తియ్యటి కలకండఇస్తాను. చేతి నిండా వెన్న ఇస్తాను. ఇంత ఎండలో బయటకు వెళ్ళకు నాయనా !
కృష్ణుడు : కాచిన పాలు, కలకండ, వెన్న ఏవీ వద్దు నాకు. సంతోషంగా ఆవుల్ని కాచి తిరిగి వస్తాను. 
 
(శ్రేష్టమైన పదార్థాలు ఇస్తాను వాటిని స్వీకరించి  నా దగ్గరే ఉండు, బయట ఎండలోకి వెళ్తే కందిపోతావు - అని జీవుడు పరమాత్మకు చెప్తున్నాడు. ఈ శ్రేష్టమైన పదార్థాల మీద నాకు ఆశ లేదు,  అలాగే వేడి - చల్లని అనే ద్వంద్వము నాకు లేదు. గోపాలుడిగా (జీవులని పాలించేవాడిగా, భూమిని పాలించేవాడిగా, వేదాలను రక్షించేవాడిగా) నా పని నన్ను చేసుకోనివ్వు అని పరమాత్మ చెప్తున్నారు)

చరణం 2:
యశోదమ్మ: యమునా తీరం వెంబడి దొంగలున్నారు నాయనా ... వాళ్ళు నీ మీద దాడి చేస్తారు అయ్యా ... వెళ్ళవద్దు

కృష్ణుడు: ఒక దొంగ ఇంకొక దొంగ ని ఇబ్బంది పెట్టడం ఎక్కడన్నా చూశావా అమ్మా ? నిజంగా వాళ్ళు దాడి చేస్తే - వాళ్ళ పీచం అణిచివేస్తాను, వాళ్ళని ముక్కలు చేస్తాను. 
 
(యమున జీవన ప్రవాహానికి ప్రతీక. దాని తీరంలో జీవుడి జీవన సారాన్ని అపహరించే సంసార దుఃఖాలు, సమస్యలు చోరుల్లాగా కాచుకుని ఉన్నాయి. అందుకని నువ్వు అటు వెళ్ళద్దు అని జీవుడు అడిగాడు. ఈ దొంగలను చీల్చి చెండాడే పెద్ద దొంగని నేను. ఎంత సంసారంలో మునిగి ఉన్నా నేను పైకి లేపగలను - జీవన సారాన్ని దొంగిలించే దొంగల్ని ముక్కలు చెయ్యగలను అని పరమాత్మ చెప్తున్నారు)

చరణం 3:
యశోదమ్మ: గోవర్ధన గిరి దగ్గర పులులు, ఎలుగుల వంటి క్రూర మృగాలు ఉంటాయి నాయనా ! అవి నీ మీద దాడి చేస్తాయి. బయటకు వెళ్ళవద్దు. 

కృష్ణుడు: నేను గోవర్ధన గిరికి వెళ్తే అన్ని అడవి జంతువులూ నన్ను చూస్తాయి. ఒక వేళ అవి నా మీద దాడి చేస్తే నేను వాటిని వేటాడతాను. 
 
(రకరకాల చెట్లు పుట్టలు జీవులు ఉండే గోవర్ధన గిరి మనిషి మనస్సుకి ప్రతీక. అక్కడ వసించే క్రూర మృగాలు - కామం,క్రోధం, లోభం, మదం, మొహం, మాత్సర్యం, వాసనలు, జ్ఞాపకాలు, బలాలు-బలహీనతలు, అహంకారం-మమకారాలు. పరమాత్మ సంచరించాల్సిన మనసులో అవి ఎప్పుడూ తిరుగుతూ పై చేయి సాధించాలని చూస్తూ ఉంటాయి. ఇన్ని క్రూరమృగాలను వేటాడి శాంతిని ఇవ్వగల వాడిని నేను అని పరమాత్మ చెప్తున్నారు)

చరణం 4:
యశోదమ్మ : నిన్ను ఎంతో ముద్దు చేసే మీనాన్నగారు నందుడు వచ్చి 'నా చిన్న బాబు' ఎక్కడ అని ప్రశ్నిస్తే నేనేమి చెప్పను కన్నయ్యా ?

కృష్ణుడు: నేను బయటకు వెళ్లి పిల్లలతో బంతి ఆడుకుంటూ ఉన్నాను -అని చెప్పు నాన్నగారికి. నువ్వు నన్ను వెతుక్కుంటూ రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ ఇక్కడకు వచ్చేస్తాను. 

(నంద మహారాజు జీవుడి ఆధ్యాత్మిక చేతనకు ప్రతీక. జీవుడి ఆధ్యాత్మిక చేతన వచ్చి జీవుడిని అడుగుతుందట  - పరమాత్మ ఎక్కడ అని. అప్పుడు నేను ఏమి చెయ్యాలని జీవుడు అడిగితే, పరమాత్మ ఇలా చెప్తున్నారు - "నేను ఇన్ని గోళాలని నా సహాయకులతో కలిసి ఆడుతూ ఉంటాను. నీ ఒక్క ఆర్తితో  కూడిన పిలుపు వినపడగానే క్షణాల్లో నీ దగ్గర ప్రత్యక్షమవుతాను")


సారాంశం - పరమాత్మ ఉనికి / గురువు కృప జీవుడికి  మొదటి సారి అనుభవం లోకి రావడం కేవలం మొదటి మెట్టు మాత్రమే.
 
జీవుడితో పరమాత్మ చేసే ప్రయాణం - రకరకాల విచిత్రాలతో, పరీక్షలతో - ఒకింత కఠినంగా ఉంటుంది. ఒక్కొక్క క్షణం జీవుడికి  పరమాత్మతో ఎంత దగ్గరితనం ఉంటుందో, ఒక్కొక్క  క్షణం అంత ఏకాకి భావం కలుగుతూ ఉంటుంది. దీనికి తోడు రకరకాల సందేహాలు, ఆలోచనలు. 
 
ఒక మెట్టు ఎక్కగానే పది మెట్లు ఎక్కానన్న అహంకారం జీవుడిని కమ్మెయ్యవచ్చు. నా లాంటి అపురూపమైన భక్తుడు లేరు అన్న భావన కలగవచ్చు. పరమాత్మ సాన్నిధ్యాన్ని / గురువు సాన్నిధ్యాన్ని పొందిన ఇతర వ్యక్తులని చూసి ఈర్ష్య కలగవచ్చు. పరమాత్మ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కువ్యాఖ్యానాలను అన్వయించుకుని లేని పోని నాస్తికత లేదా  అజ్ఞానం వైపు దారి తీయవచ్చు.
 
వీటన్నిటికీ ఒకటే విరుగుడు. ఆర్తితో కూడిన ఒక పిలుపు, పసి పిల్లాడి పట్ల ఉండేటటువంటి కల్మషం లేని అచంచలమైన షరతులు లేని  ప్రేమ - ఇది మాత్రమే జీవుడిని పరమాత్మతో అనుసంధానం చేసి ఉంచగల సాధనము  - భక్తి, ప్రేమ అనేవి ఉత్కృష్టమైనవి, అలాగే సక్రమంగా ఉద్దీపన పొందితే వాటంత సరళమైనవి ఏవీ లేవు ...  తర్కము లేని ప్రేమ, హృదయ పాత్రను అంచుల వరకు పొంగి పొర్లేలా నింపే కల్మషం లేని భక్తి. - జీవుడికి శాంతిని కలిగించే అమృత ఫలాలు.
































Comments

  1. Jeevunilonivividha aadhyachmikakonamulanu. Baagaaviskarinchavu. Inka emichappina deeniki konasaaginpe avutundi .Amma n nanna

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

దయా సముద్ర తరంగాలు

గురుర్దేవో మహేశ్వరః